
మహా పంచముఖేశ్వర స్వామి వారి దేవస్థానం


కాండ్రపాడు



కాండ్రపాడు గ్రామం, చందర్లపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఈ పంచముఖేశ్వరుడు 1937వ సంవత్సరం(ఈశ్వర నామ సంవత్సరం) ఏప్రిల్ 15 చైత్ర శుద్ధ పంచమి, మృగశిర నక్షత్రం, బుధవారం ఉదయం 10 గంటలకు పాటిమన్ను తవ్వుతుండగా బయటపడ్డారు. ఈ శివలింగంతో పాటు గుడికి నాలుగు దిక్కులా దర్శనమిచ్చే నాలుగు శివలింగాలు, రాతి ఫలకం కూడా ఆనాడు బయటపడ్డాయి. ఈ రాతి ఫలకం విగ్రహ ప్రతిష్ఠా సమయంలో వేయబడిన యంత్రం గా చెప్పవచ్చు. 2002వ సంవత్సరంలో నూతన ఆలయాన్ని నిర్మించి, అదేవిధంగా రాజారాజేశ్వరి అమ్మవారిని, మరియు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రతిష్టించి జీర్ణోద్ధరణ కార్యక్రమం జరిపించారు.
ఈ ప్రదేశాన్ని చాగివంశపు రాజులు పరిపాలించినట్లు 1155వ నాటి శాసనం ద్వారా తెలుస్తుంది. వారి రాజధాని ఇక్కడ దెగ్గరలోనున్న గుడిమెట్ట గ్రామం(గుడిమెట్ల). ఈ చాగి వంశపు రాజులు కాకతీయ రాజ్య సామంతులుగా పరిపాలించేవారు. చాగి వంశపు రాజు అయిన పోతరాజు ఇక్కడ ఉన్న పంచముఖేశ్వరుడిని ప్రతీ రోజు దర్శించుకునేవాడు. భీమకవి శాపం వలన ఈ రెండు గ్రామాల మధ్యనున్న వాగు వద్ద గుర్రం మీద వెళుతుండగా శత్రువుల దాడి ఫలితంగా మరణించాడు. రాయ గజ కేసరి అయిన రాణి రుద్రమదేవి ఈ ప్రదేశానికి వచ్చి హవిర్భిల్వార్చనకు, అఖండ దీపారాధనకు బేతవోలు(జగ్గయ్యపేట) గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు గుడిమెట్టలో దొరికిన శాసనపు ఆధారాల ద్వారా తెలుస్తోంది. శాతవాహన, ఇక్ష్వాక, కాకతీయ, విజయనగర మరియు రెడ్డిరాజుల కాలం సైతం ఇచ్చట పరిపాలన సాగినట్లు తెలుస్తుంది. అందువలన 11వ శతాబ్దం నాటికే ఇక్కడ స్వామివారు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రాచీన గుడి యొక్క ఆనవాళ్లు మాత్రం ఇక్కడ లభించలేదు, కానీ ఇప్పుడు ఉన్న ఆలయానికి వాయువ్యం వైపు శిధిలమైన కోనేరు మాత్రం ఉండేది.
సాధారణంగా పంచముఖ ఆలయాలలో నాలుగు ముఖములతో స్వామివారు దర్శనమిస్తారు, ఐదవ ముఖం అంతర్ముఖముగా పరిగణిస్తారు, కొన్ని కొన్ని సందర్భాలలో లింగానికి పైభాగంలో కానీ, లింగానికి ఈశాన్య ముఖముగా చిత్రీకరించబడుతుంది. అరుదుగా కనిపించే ఐదు ముఖములతో కలిగిన విధంగా ఇక్కడ ఉన్న పంచముఖేశ్వరుడు దర్శనమిస్తారు. ఈ ఐదు ముఖములు లింగానికి ఐదు దిక్కుల వైపు ఉంటాయి, అనగా తూర్పు, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్య ముఖములతో ఇక్కడ ఉన్న స్వామి వారు దర్శనమిస్తారు. ఇదే ఇక్కడ ఉన్న లింగం యొక్క విశిష్ఠత.

పరోక్ష సేవ
త్వరలో

















